అర్దరాత్రి అయ్యింది. వాళ్ళు ఇంకా రాలేదు. మాకు భయం వేస్తుంది. నేను అప్పటికే మా బంధువులకి, నాన్న ఫ్రెండ్స్ కి ,..అందరికీ ఫొన్ చేసాను ఎవ్వరూ " ఇక్కడకు రాలేదమ్మా" అంటూ ఫొన్ పెట్టేస్తున్నారు. మాకు భయం ఇంకా పెరుగుతుంది. వాళ్ళ సెల్ ఏమో 'స్విచ్ ఆఫ్' అని వస్తుంది. ... అలాగే ఎదురు చూస్తూ కూర్చున్నాం, తమ్ముడు కునికి పాట్లు పడుతున్నాడు.
3గంటలప్పుడు ఫోన్ మోగింది ఇద్దరం ఉలిక్కిపడ్డాము. నేను వెళ్ళి లిఫ్ట్ చేసాను. "'..........'హాస్పిటల్ నుంచి చేస్తున్నాం '......' నెంబరు కారు మీదేనా అమ్మా" ? అన్నారు ".
నాకు వొంటినిండా చెమటలు పోసాయి హాస్పిటల్ నుండి అనగానే.
"అవునండీ ... ఎందుకు ? ఏమయ్యింది..?"
"మీ కారుకు నిన్న సాయంత్రం '.....' దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. అందులో వున్న ఇద్దరికీ దెబ్బలు బగా తగిలాయి. వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది.మేము రాత్రినుండీ మీకు ఫొన్ చేస్తున్నాము. ఫొన్ ఎంగేజ్ వస్తుంది ఫొన్ పనిచేయడం లేదనుకున్నాం, కానీ.... వారి పరిస్తితి ఇప్పుడు ఏమీ బాగోలేదు అందుకే మళ్ళీ కాల్ చేసి చూద్దామని చేసాం" ... ఇంకా ఎదో చెబుతున్నారు అప్పటికే నా కాళ్ళకింది భూమి కంపించింది.
వాళ్ళతో "వాళ్ళు మా అమ్మా,నాన్న. మేము ఇప్పుడే వస్తున్నాము" అన్నాను.
వెంటనే ఇంట్లోకి వెళ్ళి క్రెడిట్ కార్డ్స్, డబ్బులు తీసుకొని కార్ లో తమ్ముడూ, నేనూ బయలుదేరాం.
ఆ హాస్పిటల్ మ ఇంటికి చాలా దూరం మేము వెళ్ళేసరికే నాలుగయ్యింది.........
(తను ఇలా చెబుతూనే వుంది నాకూ గుండె దడ మొదలయ్యింది.)
మమ్మల్ని ICU కి తీసుకెళ్ళారు.
అక్కడ డాడీ.!..?. వళ్ళంతా బ్యాండేజులు, రక్తం...
కానీ డాడీ మెలుకువ గానే వున్నారు. మా వైపే చూస్తున్నారు ఆ కళ్ళు ఆనందంగా మెరుస్తూ మమ్మల్ని దగ్గరికి రమ్మని సైగ చేసాయి . మేము ఏడుపు ఆపుకోలేకపోయాము. డాడీ నెమ్మదిగా మాట్లాడు తున్నారు.
'ఎందుకేడుస్తున్నారు ? నాకేమీ కాలేదు చిన్న దెబ్బలేగా... తగ్గిపోతాయిలే' అంటూ కళ్ళు చుట్టూ తిప్పి 'అమ్మ ఏది'...? అన్నారు.
నేను 'మేము ఇప్పుడే వచ్చాము డాడీ మేమూ ఇంకా అమ్మను చూడలేదు' అన్నాను.
'ఓ ! మరిచి పోయాను తనూ నా పక్కనే వుంది కదూ ! ,పాపం తనకేమయినా దెబ్బలు తగిలాయేమో..? అయినా 'ఆ లారీ వాడిదే తప్పమ్మా ఎదురుగా వచ్చేసాడు... ' అంటున్నారు.
'ఓ అయితే యాక్సిడెంట్ చేసింది లారీ అన్నమాట ' అనుకున్నాము.
డాడీ మాట్లాడుతూనే మత్తులోకి వెళ్ళిపోయారు. మేము బయటకు వచ్చి,
అక్కడ సిస్టర్ని 'మరి మా అమ్మ ఎక్కడండీ ?' అని అడిగాము.
ఆమె మా ఇద్దరి వైపూ చూసి "ఇంకా పెద్దవాళ్ళు ఎవరూ రాలేదామ్మా ?" అని అడిగింది.
మేము లేదని తల ఊపాము తను మా ఇద్దర్నీ వేరే రూంలోకి తీసుకెళ్ళింది. అక్కడ అమ్మ పడుకొని వుంది....
కానీ అమ్మా..అమ్మా.. అని తనను పట్టుకొని ఎంత వూపినా తను కదలడం లేదు.... మా వైపు చూడటం లేదు.....
సిస్టర్ నా బుజం మీద చెయ్యేసి తల అడ్డంగా ఊపి.... "యాం సారీ" అంది.
"అంటే... ? 'అమ్మా...?..?..?' "
'యెస్ ' 'ఆన్ స్పాట్' అంది.
మా తమ్ముడు గట్టిగా అమ్మను పట్టుకొని ఏడ్చేస్తున్నాడు నాకు అంతా అయోమయంగా ఉంది.ఉదయమే కదా ! నవ్వుకుంటూ వెళ్ళారు మరి ఇప్పుడు...?
నాకూ దుఃఖం కట్టలు తెంచుకొంది.
బంధువులంతా వచ్చారు.
తరువాత .....అమ్మను ఇంటికి అక్కడినుండీ... ఎక్కడికో... ? తీసుకెళ్ళిపోయారు.
*****************************
తను ఏడుస్తుంది నేను ఆపాలనుకోలేదు ఆపే దైర్యం చెయ్యలేదు ఎందుకంటే అప్పటికి నాకే చున్నీ అంతా తడిసిముద్దయ్యింది వినే నాకే అంత భాధ వేసినప్పుడు అనుభవించిన తనకి ఇంకెలాగుంటుంది ..?
మళ్ళీ తను ఏడుపు ఆపి చెప్పడం ప్రారంభించింది...
"మేము డాడీ కోసం ఇంకా హాస్పిటల్లోనే వున్నాము. డాడీ రెండు రోజులు అలా ఆ బెడ్ మీదే కోమా లో వున్నారు.
మూడో రోజు ఉదయం డాడీ కూడా మమ్మల్ని ఒంటరిగా ఒదిలి ఈ లోకం నుండి వెళ్ళిపోయారు................
అప్పుడు డాడీ మొఖం చూస్తే 'పాపం అమ్మ ఒంటరిగా వుండలేక పిలుస్తుందమ్మా అందుకే వెళ్ళాను'. అని మాతో అన్నట్టు వుంది......
మాకింక ఏడవడానికి కళ్ళలో నీళ్ళు, ఒంట్లో ఓపిక కూడా లేకుండా పోయాయి".
******************
తను చెప్పడం ముగించి వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనను ఓదార్చడం ఎలాగో నాకు తెలియలేదు.