14.చిక్కింది నీ తోక నా చేతిలో

"అది ఎంటంటే ఏమిలేదు ముందు అన్నం పెట్టు తర్వాత చెబుతాను"

"సరే పట్టు..."
తను అన్నం తినడం అయిపోయింది, ఇద్దరం వచ్చి హాల్లో కూర్చున్నాం.

"ఊ ఇప్పుడు చెప్పు ఎంటో ఆ ఇంపార్టెంట్ విషయం"అన్నాను.

తను మాట్ల్దకుండా బ్యాగ్ లో నుండి శుభలేఖ తీసి నా చేతిలో పెట్టింది.

అది తమిళంలో వుంది వెంటనే అది చూసి "ఏంటి వెటకారమా..?" అన్నాను.

"what come again" అంది.

"జోక్సా" అన్నాను.

"ఎందుకలా అంటున్నావు"అని అడిగింది.

"నాకు తమిళ్ మాత్లాడితేనే అర్ధం కాదు, నువ్వు ఏకంగా ఇది చదవమంటే నాకేమర్దమవుతుంది ..?"

"ఓ అదా!...అది కాదురా అసలు ఎమి జరిగిందంటే మా పెద్దనాన్న కార్డ్స్ ప్రింట్ వేయించి ఇంటికి తెచ్చి ఎవరితోనో "సుధాతో చెప్పండి ఫస్ట్ కార్డ్ మధురై ఆండాళ్ళ్ కి ఇవ్వడం మన ఆచరమని", అని మళ్ళీ బయటకు వెళ్తూ "నిజానికి అది వాళ్ళ అమ్మానాన్న చేతులుమీదుగా అందరూకలిసి ఇవ్వాలనుకో..." అన్నారు. నేను అది విని వెంటనే ఫస్ట్ కార్డ్ తీసి బ్యాగులో పెట్టుకున్నాను" అంది.

"అవునా..మరి మధురై వెళ్ళి వచ్చావా..?" అని అడిగాను

"ఇంకా వెళ్ళలేదు మరి ఫస్ట్ కార్డ్ అమ్మవారికి ఎవరిచ్చారు.?

"నాకు ఎందుకో ఆ కార్డ్ మీనాక్షి ఆండాళ్ కంటే ముందు నీకు ఇస్తే.. మంచిదేమో అని అనిపించింది .... అందుకే నీకే ఇచ్చాను, now i feel very happy" అంది.

అది విని నాకు చిర్రెత్తింది.

"నీకసలు బుద్దుందా? మతి వుండే మాట్లాడుతున్నావా?" అన్నాను కోపంగా.

తను బిక్కమొఖం వేసి "ఏ? ఏమయ్యింది? ఎందుకలా అంటున్నావు? అంది.

"మరి నువ్వు చేసే పనులకు నిన్ను ఇంక ఏమనాలో చెప్పు." అన్నాను ఇంకా కోపంగా.

"అదికాదు ..." అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది.

కానీ నేను వినలేదు, వినాలని కుడా అనిపించలేదు తన మాటలకి అడ్డు తగిలి
"అసలు నేను ఇన్నాళ్ళు ఎందుకు నీ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదో నీకు అర్దమయ్యి ఉంటే నువ్వు మళ్ళీ అదే తప్పు చేసి వుండే దానివి కాదు." అన్నాను.

"అంటే నా మనసుకి అనిపించింది నేను చెయ్యడం తప్పా."

"ఎమిటి నీ మనసుకు అనిపించింది."

"నువ్వు మా అమ్మవి అందుకే గుడిలో ఆ ఆండాళ్ళుకు ఇచ్చేకంటే ముందు నీకు చూపించి తరువాత ఇవ్వాలనుకున్నాను అది తప్పా చెప్పు."

"అమ్మా,అమ్మా ఎందుకు అలా అంటావ్ పొద్దాకా. నేనేమయినా నిన్ను కన్నానా ? పెంచానా ? అదీ కాక కనీసం నేను నీ కంటే పెద్దదాన్ని కుడా కాదు....." అన్నాను కొంచెం అసహనంగా

"ఏమో బంగారు నువ్వు చెప్పేది నాకు అర్దం కాదు నేను అనేది నీకు అర్దం కాదు."

"ఇందులో అర్దం అవ్వడానికి ఎముంది నువ్వు ఇలా నన్ను ఒక పెద్దదానిలా డీల్ చెయ్యడం నాకు ఎందుకో భాధగా వుంటుంది." అంటున్నాను.

"అలా అని ఎందుకు అనుకుంటున్నావ్ ? నేను నిన్ను ఎప్పుడూ అలా అనుకోలేదు ! నువ్వు నాకు పెరుమాళ్ళు చూపించిన అమ్మవు, మా అమ్మను నీలో చూసుకుంటున్నాను". అంది బుజ్జగిస్తునట్టుగా

"అలా చూసుకుంటే నేను ఏమీ అననను కాని నువ్వు అలా చూసుకోవడమే కాకుండా నేను నిజంగా మీ అమ్మలాగే ప్రవర్తిస్తున్నావ్."ఇంకొంచెం అసహనంగా

"ఓహ్ అవును కదా నువ్వు మా అమ్మవి, కానీ నేను నీ కూతుర్ని కాదుకదా..!" అంది బాధగా.
తన మాటల్లో బాధ అర్ధమయినా అందులోని మర్మం నాకు అప్పుడు అర్ధం కాలేదు.
(అది అర్ధమయ్యే సమయానికి .............)

మళ్ళీ తనే తమాయించుకొని "అయితే ఇంతకీ ఇప్పుడు ఏమంటావు" అంది.

"ముందు నువ్వు అర్జెంట్ గా మధురై వెళ్ళి చేసిన తప్పుకు ఆ అమ్మవారికి సారిచెప్పి ఈ శుభలేఖ ఆమె పాదాల వద్ద పెట్టెయ్యమంటాను"

"సారీ ఆ..!? అసలు నేను తప్పు చేసాననే నేను అనుకోవడం లేదని చెప్పానా.."

"చుప్ ! మళ్ళీ అదే మాట అంటావ్ దొంగతనం చేసేవాడుకూడా అది 64 కళలలో ఒకటే కాబట్టి తప్పులేదు అన్నాడంట అలా వుంది నువ్వు చెప్పేది."

"......."

"ఏ అలా మాట్లాడకుండా కూర్చుంటావే చెస్తావా లేదా చెప్పు ...? అయినా నేను మీ అమ్మని అంటున్నావుగా సో కూతురు తప్పు చేస్తుంటే చెప్పాలిసిన బాధ్యత నాకుంది." అన్నాను

నేనలా అనేసరికి తన పెదవుల మీద చిరునవ్వు ఒక్క క్షణం తళ్ళుక్ మంది, కానీ వెంటనే మళ్ళి సీరియస్ గా అయ్యిపోయింది. నేను ఇంత అరుస్తున్నా తను నాతో ఏమీ మాట్లాడటంలేదు తలవంచుకొని అలా మౌనంగా కూర్చునేవుంది. నాకింక కోపం వచ్చేసింది.
"సరే నువ్వు ఎంతకాలం అలా మాట్లాడకుండా వుంటావో ఉండు కానీ నేను ఇంక నీతో ఎప్పటికీ మాట్లాడను" అన్నాను.

తను వెంటనే తల పైకెత్తింది అప్పుడు చూసాను తన కళ్ళనిండా నీళ్ళు, నేను ఇంక తన మొఖం చూడలేక పక్క గదిలోకి వెళ్ళాను ఏదోపని ఉన్నదానిలా(బహుషా నేను వెళ్ళింది నా మొఖం తనకి చూపించలేకేమో) తను గట్టిగా అరిసి నాకు సమాధానం చెబుతుందేమో అని అనుకున్నాను.

ఇంతలో ఏదో అలికిడి అయ్యింది నేను గదిలోనుండి బయటకి వచ్చి చూసేసరికి గేటు చప్పుడు ఆ వెంటనే స్కూటీ సౌండ్ వినిపించాయి.. తన ఈ ప్రవర్తనకి తను నా మాట్లకు బాధపడి వెళ్ళిపోయిందేమో అని నాకు అప్పుడు అనిపించలేదు కానీ, తను నాకు ఏ సమాధానం చెప్పకుండా అలా వెళ్ళినందుకు తనతో ఇంకెప్పుడూ మాట్లాడకూడదు. అనే కసి మాత్రం పెరిగింది.

"పో పో ఎంతకాలం అల మట్లాడకుండా ఉంటవో నేను చూస్తానూ" అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చేసరికి....
అక్కడ కుర్చిలో నేను పెట్టిన శుభలేఖ లేదు అంటే ఇప్పుడు నేను పట్టుకున్న ఆ కార్డ్ తీసుకువెళ్ళి అమ్మవారికి ఇస్తుందన్నమాట మొత్తానికి పంతం నెగ్గించుకుంది, మొండిఘఠం. అనుకొని

పక్కకు తిరిగేసరికి బెడ్ మీద తన సెల్ ఫోన్ ఉంది.

నేను ఒక్కసారే పెద్దగా నవ్వుకున్నాను...

"రిమా ఇప్పుడు చిక్కింది నీ తోక నా చేతిలో" అనుకుంటూ....

13.ఎలుకల కూర-మ్యాంగో పికిల్

ఇంకో రెండు రోజులు అలానే గడిచాయి..

తరవాతి రోజు ఉదయం 11 గంటలకి.. నాకు పుస్తకం ముందున్నా 'రిమా' గురించే ఆలోచనలు..

తనని మరీ ఎక్కువ భాధ పెడుతున్నానేమో అని. నాకు తనతో పరిచయం అయ్యి నాలుగేళ్ళు అవుతుంది.. కానీ మొదటినుండీ ఈ స్నేహం వింతగానూ,ఇంకా అదేదో చెప్పలేని ఫీలింగ్..
తను నన్ను ఇష్టపడ్డంత నేను తనని ఇష్టపడలేదేమో అనిపిస్తుంది నాకు, అంతేకాదు తను నాతో ఉన్నంత ఫ్రీగా నేను వుండలేకపోయేదాన్ని, తను చెప్పినంత ఓపెన్ గా నా మనసులో విషయాలు తనతో చెప్పలేక పోయేదాన్ని, నాకెందుకో తను నాకోసం ఏది చేసినా అది ఓవర్ గా అనిపించేది, అంతేకాదు తనతో స్నేహం చేయడానికి కూడా నేనేదో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని, వీటన్నిటికి కారణాలు లేకపోలేదు..

తనకు నాకు వున్న age diffrent మొదటికారణం.

language రెండో కారణం తను తమిళ్,తెలుగు,హింది,ఇంగ్లీష్,ఏ language లో మాట్లాడినా నేను అర్దం చేసుకోగలిగేదాన్ని కానీ తిరిగి తనతో మాట్లాడటానికి నాకు తెలుగు తప్ప ఇంకో బాష వచ్చేది కాదు.

మూడోకారణం ఇన్ని రోజులు గడిచినా తను మా అమ్మ,నాన్నలతో మాట్లాడానికి భయపడటం.

నాలుగో కారణం తనకు వాళ్ళ అమ్మమీదున్న ప్రేమఅంతా నా మీద చూపించడాన్ని కూడా నేను తట్టుకోలేకపోతున్నాను.
ఈ అతి(ఎక్కువ)ప్రేమతో తను చేసే పనులు నాకు ఇంకా అతిగా అనిపించేయి. ఒక్కో సారి చిరాకుగా కూడా వుండేది, ఇంకొకసారి తన పరిస్తితి సరిగా అర్దం చేసుకోకుండా తప్పుగా ప్రవర్తిస్తున్నానేమో అనిపించేది.
నేను ఇలా ఆలోచిస్తుండగానే...

ఫోన్ మోగింది... లిఫ్ట్ చేయగానే

"నేను ఇంటిముందున్నా" అంది.సీరియస్ గా..
నేను అంతే సీరియస్ గా "లోపలికి రా " అని పోన్ పెట్టేసాను.
వస్తూనే "నీకు ఎందుకంత కోపం.. నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నవ్"అంది.
"నువ్వు చేసే తిక్క పనులకి కోపం రాదా మరి"
"తిక్క పనేమీ కాదు నాకు అప్పుడు అలా అనిపించింది అప్పుడే కాదు ఇప్పుడూ అలానే అనిపిస్తుందనుకో.."
"రెండు తంతే ఇంకా బాగా అనిపిస్తుంది." అని చెయ్యెత్తాను.
"నన్ను కొట్టడానికి నువ్వెవరివి..?"
"ఎవరనుకొని నువ్వు నాతో మాట్లాడుతున్నావ్"
"మా అమ్మవనుకొని"
"అయితే నేను మీ అమ్మనే కదా నాకు నిన్ను కొట్టే రైట్ ఉంది."
"అహా అలానా ? కొట్టే రైట్ వుంది కానీ.. నా మ్యారేజ్ కి వచ్చే బాధ్యత లేదా..?"
"డైలాగులు కొట్టకు నాకు మండిపోతుంది"
"ఎందుకే ఇంత రాక్షసిలా తయారవుతున్నావు."
"నిన్ను భరించాలంటే రాక్షసిలానే ఉండాలి"
"ఆహా ఇదవరకు ఎలా ఉండేదానివి...? అమాయకంగా, భయం భయంగా..అక్కా..అక్కా అనుకుంటు... ఇప్పుడేమో ఇలా మొండి దానిలా తయారయ్యావు".
"నాలుగేళ్ళుగా నీతో వుంటున్నానుగా నీ మొండితనం, రాక్షస లక్షణాలు నాకూ వచ్చాయి".
"మాటకి మాట బాగా చెబుతున్నావ్"
"అవును చెబుతాను... ఇప్పుడు ఏమంటావ్."
(ఇలా కోపంగా తిట్టుకుంటున్నామో చనువుగా మాట్లాడుకుంటున్నమో అర్దం కానట్టుగా సాగిపోతుంది మాసంభాషణ.)
"నేనేమంటానే తల్లీ నీతో మాట్లాడేసరికి నాకు ఆకలేస్తుంది ఇంట్లో ఏమయినా వుందా..?"
"బయట గడ్డి వుంది తెమ్మంటావా..?"
"ఆ "
"గడ్డి.... గ్రాస్ తెమ్మంటవా..?"
"ఆ తీసుకురా ఏదో ఒకటి అసలే 3days నుండీ ఏమీ తినడం లేదు"
"ఏ ఏమొచ్చింది."
"నువ్వు అలా మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంటే ఎలా తినబుద్దేస్తుంది".
(నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి... ఎమనలో అర్దం కాలేదు.)
"సంతోషించాంలే..! తెలివి బాగా ఎక్కువయ్యింది. ఇందుకు కాదు నిన్ను కొడతాననేది." అంటూ వంటింట్లోకి వెళ్ళాను
"ఊ...ఆపు ఇంక... తిట్లతో కడుపు నింపేస్తున్నవు."
"అసలే నాకు వుడుకుమోత్తనం ఎక్కువ నీ తిక్క చేష్టలతో నన్ను ఇంకా రెచ్చగొట్టకు"
"ఎలుకల కూర తింటావా "
"అంటే"
"ఆ... ర్యాట్ కర్రీ వచ్చి చూడు"
"ర్యాట్ కర్రీ..ఆ అది కూడా చేస్తారా...మీ ఇంట్లో"
"ఏ మీ ఇంట్లో చెయ్యరా..?"
"ఏది "
"ఇదిగో.. అంటూ గిన్నేలోనుండి ఆ ఎలుక తోక పట్టుకొని పైకి ఎత్తి చూపించాను."
"this is look like rat only,but this is not rat am right !? " అంది.
"అహా చేసావులే గొప్ప ఇన్వెస్టిగేషన్ ఇది కాకరగాయ.."
"కాకరగాయ్..!? దీన్ని ఎలా చేస్తారు..?"
"ఊ..చేత్తో.. తింటావా లేదా చెప్పు "
"తింటానులేకానీ ఇదేంటి..?" అంటూ వేరే గిన్నెమూత తీసింది.
"అది మామిడికాయకారం అంటే మ్యాంగో పికిల్ వెయ్యనా..?
"ఆ.. ఆ..వెయ్యి "
"నీ తిక్క కుదరాలంటే ఇదే రైట్" అని మామిడికాయ కారం వేసి ఎర్రగా కలిపి "ఊ పట్టు" అంటూ అన్నం కలిపి నోట్లో పెట్టాను.
"వావ్ సూపర్ ! "
"ఏంటి కారంగా లేదా"
"లేదు నీ చేత్తో పెట్టావుగా.."
"అయితే నువ్వే తిను"
"ఎందుకు..!?"
"నీకు కారంగా అనిపించాలనే కదా ఇంత ఎర్రగా కలిపింది.అందుకనే నువ్వే తిను."
"ఆ అలా అయితే చాలా కారంగా ఉంది అబ్బా..ఉ...ష్...!"
"నాటకాలు ఆపి కుదురుగా కూర్చోని తింటావా ..!?
"నాకు అన్నం అలా ఒకచోట కూర్చోని తినడం ఇష్టముండదు".
"అలా తిరుక్కుంటూ తినడం నాకు ఇష్టముండదు. వచ్చి కూర్చో".
"సరే నీ ఇష్టం కానీ ప్లీజ్ ఈ చైర్లో కూర్చోను... కావాలంటే ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటా .."
"దాని మీద కూర్చోంటే అది విరుగుతుంది అప్పుడు మా అమ్మ నన్ను ఇరగదీస్తుంది".
"ఓ రియల్లీ..! అయితే ఇక్కడే కూర్చుంటాను".
"సరేలే ఎక్కడో ఒక చోట కూర్చో ముందు అన్నం తిను".
"మర్చిపోయాను అసలు నేను ఇక్కడికి ఒక ఇంపార్టేంట్ పని మీద వచ్చాను".
"ఇంపార్టేంట్ పనా ..? ఏమిటది..?"
"...... ఏమిటంటే "

12.పిచ్చి ప్రేమ పెళ్ళి

అమ్మ వచ్చి.. కాళ్ళు కడుక్కోవడానికి ఇంటి వెనక్కి వెళ్ళింది ఇంతలో ఫొన్ మోగింది ఎవరా..? అనుకుంటూ ఫొన్ తీసి
"హలో..!" అన్నాను.
"బంగారం నేనురా..?
"అరె ! ఇప్పుడేగా వెళ్ళావు ఏంటి ఇంతలోనే ఫొన్...!?" నా రెండో చెవికి కూడా వినపడంత చిన్నగా అన్నాను. (తన చెవికి మాత్రం వినిపించింది).
"నా సెల్ అక్కడే మర్చిపోయినట్టున్నానురా చూడు" అంది.
నేను చుట్టూ చూసాను అది నా పక్కన చైర్లో నిక్షేపంగా కుర్చుంది. టక్కున తీసి ఒళ్ళో (దాచి)పెట్టుకున్నా
"10 మినిట్స్ లో గేట్ దగ్గరికిరా ఇచ్చేస్తాను" అని చిన్నగా తనతో అని. బయటికి పెద్దగా
"ఇది కాదండీ రాంగ్ నెంబర్" అన్నాను.
ఫోన్ చున్నీలో చుట్టుకొని బయటకి వచ్చి ఉయ్యాలబల్లపై కూర్చుని తనకోసం ఎదురుచూస్తున్నా ఇంతలో అమ్మ వచ్చి నాపక్కన కూర్చుంది గేటుబయట స్కూటీ ఆగిన సౌండ్ అయ్యింది. నాకు ఏమిచెయ్యాలో పాలుపోలేదు ఇంతలో ఒక మెరుపు లాంటి ఆలోచన బుర్రలో తళుక్కుమంది అంతే చేతిలో ఉన్న ఫోన్ తో అమ్మ చూడకుండా మా ల్యాండ్ ఫోన్ కి రింగ్ ఇచ్చి
"అమ్మా లోపలికి వెళ్ళి చూడు ఫోన్ ఎవరో అలాగే నాకు తినడానికి ఏమయినా పెట్టు" అన్నాను.
అమ్మ లోపలికి వెళ్ళింది. నేను వెంటనే ఫోన్ డిస్ కనెక్ట్ చేసి బయటకెళ్ళి తనకు ఫోన్ ఇచ్చి సీరియస్ గా "రేపు మాట్లాడుకుందాం ఇప్పుడు వెళ్ళిపో "అన్నాను.
తను "సారీ రా" అంటూ వెళ్ళిపోయింది.
అమ్మ తిరిగొచ్చేసరికి నేను ఉయ్యాల మీద కుర్చోని ఉన్న. ఆ రోజుకి అలా గండం గడిచింది.

మరుసటి రోజు ఉదయం 10.30 అవుతుండగా ఫోన్ మోగింది.. వచ్చి లిఫ్ట్ చేసి
"హలో" అనగానే
"ఏంటిరా కాలేజ్ కి వెళ్ళలేదు..? వంట్లో బాగోలేదా ? ఎలావున్నావు..?" అంటూ స్టార్ట్ చెసింది.
"పాపా !నువ్వు కాస్త ఆపుతావా"(అప్పుడప్పుడు నేను ఎదుటివాళ్ళ గోల భరించలేనప్పుడూ అమ్మాయిలయితే 'పాపా' అని అబ్బాయిలయితే 'బాబూ' అని పిలవడం అలవాటు.)
"........"
"అవునూ నేను కాలేజ్ కి వెళ్ళలేదని నీకేమి తెలుసు ?"
"నేను ఈ షాప్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తున్నా... నువ్వు ఇంకా ఇటువైపు...."
"అంటే నువ్వు ఇంకా ఈ సైట్ కొట్టడం ఆపలేదా ...?"
"సైటా ..నేనా..హ.హ.హ్హ సర్లే కానీ కాలేజ్ కి ఎందుకు వెళ్ళలేదు ?
"మాకు నెక్స్ట్ మంత్ నుండీ exams. ఈ రోజు నుండీ ప్రిపరేషన్ హాలిడేస్ అందుకే వెళ్ళలేదు".
"ఇంట్లో ఎవరున్నారు"
"ఎవరూలేరు ఒక్కదాన్నే వున్నా..!"
"నేను రావొచ్చా"
"నిక్షేపంగా"
"what"
"ఆ... cat... అరవకుండా రావమ్మా" అన్నాను నేను నవ్వుతూ.
"సరే వస్తున్నా" అంటూ తను ఫోన్ పెట్టేసింది.
తను లోపలికి వస్తూనే " నీ ఎగ్జాంస్ నెక్ష్ట్ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ?" అంది .
"నెక్ష్ట్ మంత్ 10th కి"
"అవునా...? అయితే 22nd కి ఫినిష్ అవుతాయి కదా...!?
"28th కి అయిపోతాయి."
"అయితే నా మ్యారెజ్ "
"మ్యారేజా...? అవునూ ఎప్పుడు..?
"22nd న"
"ఓ అవునా అయితే ఏమయ్యింది ఇప్పుడు ?
"ఏమయ్యిందేమిటి ఎగ్జాంస్ వుంటే నువ్వు ఎలా వస్తావ్?
"నేనా నీ పెళ్ళికా.." అన్నాను అనుమానంగా (నిజానికి అప్పటివరకు నేను ఆ పెళ్ళికి వెళ్ళాలి అన్న ఆలోచనే నాకు రాలేదు.)
"ఊ ఎలా వస్తావ్ ?"
"అవును ఎలా రాను ?"(అప్పటికప్పుడు ఆ మాట అలా నోట్లో నుండీ వచ్చింది కానీ మనసులో ఏ ఫీలింగ్ కలగలేదు.)
తను.. "ఎలా..? ఎలా...? అని ఆలోచిస్తుంది.
నేను..
"అవునూ ఈమె పెళ్ళికి నేను వెళ్ళాలి అనే ఆలోచన నాకు ఇంతవరకూ ఎందుకు రాలేదు..? అని ఆలోచిస్తున్నా.
"సరేలేరా నువ్వేమి ఫీల్ అవ్వకు నేను ఈ నైట్ కి ఊరు వెళ్తున్నా ఏ విషయమయినా నీకు ఫోన్ చేసి చెబుతా" అని తను అలా ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళిపోయింది.

రెండురోజుల తరువాత

తను ఫోన్ చేసి..
"నీకు రెండు సారీలు రా.." అంది
"అదేంటి" అన్నాను.
"అదంతే" అంది.
"అదే ఎందుకు...?" అన్నాను.
"ఫస్ట్ సారీ నీకు నిన్నంతా ఫోన్ చేయడానికి కుదరలేదు.నువ్వు ఎదురుచూస్తూ నా ఫోన్ రాక పొయ్యేసరికి ఫీల్ అయ్యి వుంటావుగా అందుకు" అంది. (నిజానికి నేను తన ఫోన్ కోసం ఎదురుచూడలేదు అసలు ఆమె సంగతే నాకు గుర్తులేదు.)
"నేనేమి ఫీల్ అవ్వడం లేదుకానీ నేను ఫీల్ అయ్యానేమో అని నువ్వేమి ఫీల్ అవ్వకు".
"అబ్బా..."
"మరి రెండో సారీ ఎందుకు ...?"
"అదీ...అదీ.."
"ఊ.. ఎమయ్యింది..?"
"అదీ మ్యరేజ్ పొస్ట్ పోన్ చెయ్యడం కుదరదంటరా.. అందుకు..సారీ "
"పోస్ట్ పోనా ...!?..ఎందుకు..?"
"అదేరా 22nd న నీకు ఎగ్జాం వుందన్నావుగా...?"
"అయితే...!?"
"అందుకే మ్యరేజ్ పోస్ట్ పోన్ చేసి వేరే రోజు కుదురుతుందేమో అని పెద్దనాన్నగారిని అడిగాను, నెక్ష్ట్ డేట్స్ ఏమీ బాగోలేదు ...కుదరదన్నారు... అందుకే..."
ఆ మాట వినగానే నాకు కోపమో! ఆవేశమో! తెలియలేదు కానీ గట్టిగా సీరియస్ గా...
"మై గాడ్.. ! నీకేమయినా పిచ్చా ..? నాకోసం పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుంటావా..? అసలు మతి వుండే చేస్తున్నావా ఈ పనులు నువ్వు.?
"మరి నా మ్యారేజ్.. నువ్వు లేకుండా ఎలా...జ..రు..గు?"
"మీ పెద్దలందరి సమక్షంలో గొప్పగా మంచిగా జరుగుతుంది.నేను ఒక్కదాన్ని లేకపోయినంత మాత్రాన ఏమీ కాదు నోరు మూసుకొని గప్ చిప్ గా పెళ్ళి చేసుకో..." అని ఫోన్ పెట్టేసాను.
మళ్ళీ అది చాలా సార్లు రింగ్ అయ్యింది కానీ నేను తియ్యలేదు.

నాకెందుకో చెప్పలేనంతగా దుఃఖం వచ్చేస్తుంది... తనది పిచ్చి కాదు.. ప్రేమ అని తెలుసు కానీ ఆ పిచ్చిప్రేమను తట్టుకునేంత శక్తి (పొందే అంత అర్హత) నాకు లేదేమో అనిపించింది... అంతకు మించి కాని...ఇంకా వేరే విధంగా కానీ ఆలేచించే అంత జ్ఞానం ఇంకా పరిపక్వత చెందని నా వయసుకి గాని ,మనసుకుగానీ లేదు.

మళ్ళీ రెండు,మూడు రోజుల వరకూ తన ఫోన్ నేను తియ్యలేదు. ఫోన్ లిఫ్ట్ చేసి తన మాట వినగానే పెట్టేసేదాన్ని... తనని భాధపెడుతున్నానని నాకు తెలుసు కానీ తనతో మాట్లాడితే అంతకు రెట్టింపుగా నేను భాధపడవలసి వస్తుందేమో అని నా భాధ.

11.సర్ప్రైజ్.

నా భుజం పై ఓ చేయి పడింది. కొన్ని సెకన్లుపాటు అది కలో నిజమో నాకు అర్దం కాలేదు.
"అరే ! హన్రెడ్ ఇయర్స్ . నీ గురించే అలోచిస్తున్నా... ఫోన్ చేస్తావని ఎదురుచూస్తుంటే నువ్వే వచ్చేసావ్ ?".
" నీకో సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. "
"సర్ప్రైజా...!? నువ్వు ఇప్పుడు ఇలా రావడమే పెద్ద సర్ప్రైజ్ తల్లీ "
"అంటే... ? నేను ఇప్పుడు ఇలా రావడం వలన నీకు ఏమయినా ఇబ్బందా ?"
"నాకా ఇబ్బందా ? నువ్వు ఇక్కడే కొన్ని రోజులు ఉండి వెళ్తానన్నా నాకు ఇబ్బందేమి లేదు. నువ్వే అనవసరంగా మా అమ్మ నీ భాష చూసి ఏమంటుందో అని భయపడతావు. కానీ మా అమ్మ ఏమీ అనదు.ఇంకా నాకు ఇంత మంచి అక్క దొరికినందుకు సంతోషిస్తుంది కూడా."
"అబ్బా అనవసరంగా నిన్ను కదిపాను. "
"ఇంతకీ ఆ రెండో సర్ప్రైజ్ ఏంటో ..?"
"ఇక్కడే ఇలా బయట నుంచోనే చెప్పాలా లోపలికి వచ్చి చెప్పాలా ?"
" అబ్బా ! చాల్లే పద లోపలికి, ఇంతకీ ఏంటీ విషయం ? మాంచి హుషారుగా ఉన్నావ్."
" అదీ..... అదీ....... నేను ...."
" ఆ నువ్వు ?"
"నేను.. నేనూ.."
"అబ్బా ఏంటో తొందరగా చెప్పు..."
"నేను ...నీకు...నీకు.."
"ఆ నీకు..."
"అహా.... నాకు కాదు నీకు "
"యహా నాకో నీకో అసలు విషయం ఏంటో చెప్పు."
"నికోఅల్లుణ్ణితెస్తున్నా..."
"ఆ"
"నేను నీకు ఒక అల్లుడిని తెస్తున్నా "
"అల్లుడా???"
" అల్లుడు కాదా ... ఏంటబ్బా...'అల్లుడు' అనే చెప్పారే ???"
" అరే! ఏంటి నీ బాధ అసలు విషయం చెప్పు .."
"నెక్ష్ట్ మంత్ నా పెళ్ళి ..."
"వావ్! నిజంగా ? ఇదయితే పెద్ద సర్ప్రైజే, కంగ్రాచ్చ్యులేషన్".
"అవునూ... నా హబ్బీ నీకు ఏమవుతాడు...?"
"నీ హబ్బీ నాకా...?..?"
"అల్లుడు కాదా...??"
"ఓహ్ నువ్వు ఆ రూట్ లో వచ్చావా...అయితే అల్లుడేలే... అదా సంగతి అందుకేనా ఇంత ఆనందం.."
"ఆ.."
"ఊ...ఎప్పుడు..? ఎక్కడ..? ఇంతకీ అతను.. అదే మా అల్లుడు గారు ఏమి చేస్తుంటారు..."
"వారిది చెన్నై, '.........' కంపెనీ లో మేనేజర్. మా పెద్దనాన్నకు తెలిసిన వాళ్ళే...నన్ను ఎప్పుడో,ఎక్కడో... చూసారంట నచ్చానంట... అందుకే వచ్చి పెద్దనాన్నను అడిగారంట నాకంటూ .... ఏవ్వరూ ............ అందుకే అంతా పెద్దనాన్నే చూసుకుంటున్నారు.
"అవునా....."
"ఊ... పెళ్ళి చాలా గొప్పగా చెయ్యాలని చూస్తున్నారు. అందులోను కరుణా అంకుల్ కూడా వస్తారు కదా పెళ్ళికి "
"కరుణ ఏవరు !?"
"కరుణా అంకుల్ తెలియదా ?
"అసలు కరుణ ఎవరో తెలిస్తేగా ఆమె అంకుల్ తెలియడానికి "
"ఏ స్టుపిడ్ ! కరుణా అంకుల్ అంటే మా ఎక్ష్ సి ఎం 'కరుణా నిధి గారు ఆయన తెలియదా ?"
"ఓ ! కరుణానిధా ! ఆయనయితే నాకెందుకు తెలియదు చాలాసార్లు మా ఇంటిలోకి కూడా వచ్చారు."
"మీ ఇంటికి వచ్చారా ?!?"
"ఆ అవును ఏ రాకూడదా ?"
"రాకూడదా అని కాదు...మీరు ఆయనకి అంత బాగా ఏలా తెలుసు అని..? మీరు ఏమయినా భందువులవుతారా ?"
"ఏహా మేము ఆయనకి తెలుసని నేనన్నానా ? ఆయన మాకు తెలుసు అన్నాను ."
"ఆయనకి మీరు తెలియదా...? మరి మీ ఇంటికి చాలా సార్లు వచ్చారన్నావు.? "
"ఇంటికన్నానా.. ? ఇంటిలోకి అన్నాను"
"???!!!??? అంటే"
"అంటే మా ఇంట్లో ఉన్న టీవీ లోకి వచ్చారు."
"నిన్నూ...బాగా తన్నాలి"
"తప్పు అమ్మని తన్నకూడదు"
"అబ్బా ! ఊ..హూ.. అయితే ఒక ముద్దు పెట్టుకుంటానులే...."
"అదయితే ఓకే"
"ఆ ....ఊ..మ్మ్ ........."
"అవునూ ఇంతకీ ఆయనెందుకొస్తారు నీ పెళ్ళికి ?"
"ఎందుకంటే ఆయనా మా పెద్దనాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి".
"ఓ అందుకా నేను ఇంకోందుకనుకున్నానులే"
"ఇంకెందుకు"
"పెళ్ళిచేయడానికి ప్లేస్ ఎక్కడా దొరక లేదేమొ అందుకే..ఆయన్ని పిలిచారేమో అనుకున్నా..."
"??? అర్దంకాలేదు !"
"నీకర్దం కాదులే.."
"ఏ చెప్పు ఎందుకు ?"
"అదే పెళ్ళి ఆయన తల మీద ఉన్న స్టేడియంలో చెయ్యడానికేమొ అని అనుకున్నాలే "
"చీ ! పాపం... తప్పు అలా అనకూడదురా"
"సర్లే ఇంకెప్పుడూ అనను
.....సారీ,
సింగిల్ పూరీ,
నీ పెళ్ళికి నా డొక్కు లారీ,
అందులో ఎక్కి చేయి సవారి.
"ఈ పూరీ,లారీ ఏంటి ?"
"ఆ... చెప్పింది విను మీనింగులడక్కు చెప్పినా నీకు అర్దం కాదు (అయినా నీకు అర్దమయ్యేటట్టు ఎలా చెప్పాలో నాకు రాదనుకో) నన్ను చావదొబ్బుతావ్ ఎందుకు చెప్పడం ?"
"సరే చెప్పొద్దులే నేను మళ్ళీ కలుస్తాను".
"ఇంకొంచం సేపు ఉండొచ్చుగా అమ్మ కూడా వస్తుంది ."
"అమ్మో అమ్మా !?? వొద్దులే ఈ సారెప్పుడయినా మాట్లాడతాను.."

.....అంటూ సుధక్క వెళ్ళిపోయింది..
తనెళ్ళిన 2 నిముషాల తరువాత........



---- నేను
---- సుధ

10.ఊహల్లో..... సెల్లులో.... సొల్లు.

నా ఇంటర్ రిసల్ట్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను . అంతా బాగుంది కాని తరువాత ఏమి చెయ్యాలి ?

CA కాని ICWA కాని చేస్తానన్నాను నేను,
మావాళ్ళందరూ,"అవి చాలా కష్టం.అయినా ఆ కోర్స్ లు మన ఊరిలో లేవు నువ్వు విజయవాడో,విశాకపట్ణమో,హైదరాబాదో.. వెళ్ళి చదవాలి, నువ్వేమో ఒఠ్ఠి అమయుకురాలివి, అదీకాక రెండు,మూడు రోజులకొకసారి కడుపునొప్పి,కాలునొప్పి అని కాలేజ్ మానేస్తుంటావ్. అలా అయితే ఇలాంటి కోర్స్ చేయలేవు.అందులోనూ అలాంటి కోర్సులు చదవాలంటే బాగా కష్టపడాలి" అన్నారు. ఇలా చాలా రోజులు చర్చ జరిగాక... 'సరే' అని నేనూ కాస్త బారిష్టర్ పార్వతీశం లెవల్లో మంచి చెడులు ఆలోచించి,' డిగ్రీ చేసాక అయినాసరే ఈ CAలో చేరితే అక్కడ బేసిక్స్ లేకుండా డైరెక్ట్ గా CAఇంటెర్ టూ లో జాయన్ అయిపోవచ్చు' అనుకొని. డిగ్రీయే చేద్దామని డిసైడ్ అయ్యా.
అయితే మరి ఈ డిగ్రీ ఎక్కడ చేయాలి... ? అని మళ్ళీ చర్చ మొదలయ్యింది. మేము ఈ మీమాంసలో ఉండగానే మా కాలేజి వాళ్ళు ఫోన్ చేసి "నువ్వు డిగ్రీయే చదవాలనుకుంటే మేము T C ఇవ్వము, మన కాలేజ్ లోనే కొత్తగా డిగ్రీ కూడా స్టార్ట్ చేసాము కదా ! కాబట్టి నువ్వు ఇక్కడే చేరాలి" అన్నారు. ఇంక చేసేదేమీ లేక అక్కడే కామ్ గా బికామ్ లో చేరిపోయా..

తెలిసిన కాలేజ్,తెలిసిన లెక్చరర్స్,తెలిసిన ఫ్రెండ్స్, తెలిసిన దారి అంతా తెలిసినవే కానీ ఎందుకో నాకు అక్కడ ఏవీ అంతగా నచ్చలేదు అది ఎందుకో, ఏమో,నాలో ఏదో తెలియని అసంతృప్తి ఉండిపోయింది. (బహుశా అన్నీ తెలిసినవే కాబట్టేమో !?).
ఇదేమాట రిమక్క దగ్గర చాలా సార్లు అన్నాను. దానికి తను " ముందు నువ్వు ముక్కు మూసుకొని మూడు సంవత్సరాలు ఇది చదువు. ఆ తరువాత నిన్ను ఏ మేనేజ్మెంట్ కోర్స్ లోనో చేర్పించ్చి నేను చదివిస్తాను కదా ".అని అంది.అంతే నా ఊహలకు రెక్కలొచ్చి ఎక్కడెక్కడో తిరిగొచ్చాను.
రోజూ సాయంత్రం కాలేజి నుండి వచ్చేటప్పుడు తను ఎదురొచ్చేది. కాసేపు ఆ రాధా అంకుల్ షాప్ లోనో,పక్కనున్న నెట్ సెంటర్లోనో మా ముచ్చట్లు సాగేవి. తను ఊరిలో లేనప్పుడు సాయంత్రం ఆ సమయానికి తన వద్ద నుండీ ఫోన్ వచ్చేది.ఇలా మేము ఇద్దరం కొన్ని నెలల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సర్వసాదరణంగా అమ్మ దగ్గర నేను ఏ విషయం దాచను. ఎందుకంటే నాకు అందరిలోకల్లా మా అమ్మే పే....ద్ద బెస్ట్... ఫ్రెండ్. అందుకు. కానీ... సుధ అక్క విషయం మాత్రం తన దగ్గర చెప్పలేదు. ఎందుకూ అంటే పెద్ద కారణాలేమీ లేవు కానీ. మొదట్లో తను కంగారు పడుతుందని చెప్పలేదు,తరువాత తను అనుమాన పడుతుందని చెప్పలేదు,ఆ తరువాత తను అనవసరంగా భయపడుతుందేమో అని చెప్పలేదు , పోను పోను చెప్పే అవసరము......., సందర్బమూ.... రాక చెప్పలేదు.
ఒకరోజు సాయంత్రం ఇంటికొచ్చి అక్క దగ్గరనుండీ ఫోన్ రాలేదేంటా అని ఆలోచిస్తూ ఎదురుచూసుకుంటూ బయట కుర్చున్నా.నేను ఫోన్ చేస్తుంటే తన ఫోన్ కలవడం లేదు. ఏమయ్ ఉంటుందా అని ఎదురు చూస్తున్నా ఇంతలో... మా ఇంటిఓనర్ గారి ఇంటికి వచ్చిన వారి బంధువులమ్మాయి బయట ఉయ్యాలలో ఉగుతూ సెల్ ఫొన్లో మాట్లదుతుంది. అది సెల్ ఫోన్స్ వచ్చిన కొత్త. మా నాన్నకు ఎప్పటి నుండో సెల్ వున్నా బయట పది చోట్ల తిరిగే వారు కాబట్టి వారికి దాని అవసరం చాలా వుంటుంది. సుధక్క చేతిలో చూసినా తనూ వందిళ్ళ పూజారమ్మ కాబట్టి తన దగ్గర ఉండటం తప్పనిసరి అనిపించేది. కానీ ఈ అమ్మాయి చేతిలో సెల్ చూస్తుంటే ఎందుకో ఆ ఫీలింగ్ రావడం లేదు. అదీ కాక ఆ అమ్మాయి అటూ ఇటూ మెలికలు తిరుగుతూ... తెలుగూ,ఇంగ్లిష్ మిక్ష్ చేసి వాటినీ మూతి అష్ట వంకర్లు తిప్పి స్టైల్ గా, మోడ్రన్ గా మాట్లాడుతూ... ఉంది నిరంతర వార్తా స్రవంతిలా...
ఆమె ఒక్క నిముషం గ్యాప్ ఇవ్వగానే నేను ఆమె దెగ్గరకు వెళ్ళి
"అక్కా మీ డాడీ ఏమి చేస్తుంటారు ?" అని అడిగాను.
దానికి తను మూతి,ముక్కు,కళ్ళు.. పైకెత్తి "బిజినెస్"అన్నది.
నేను "ఓహొ అలానా అయితే ఈ సెల్లు బిల్లు ఎవరు కడతారు". అన్నాను. "మా డాడ్" అన్నది. "అవునా ! ఇంతకీ నెలకు బిల్లు ఎంత వస్తుందక్కా " "జెస్ట్ 2000 - 2500 మద్యలో." నేను మనసులోనే కళ్ళు తేలేసి పైకి "ఓ అంతేనా." అన్నాను. "ఆ..! ఇంకా మా ఫ్రెండ్స్ కి అయితే ఇంకా ఎక్కువే వస్తుంది".అని ఏవరూ ఫోన్ చేయక పోయినా 'ఆ హలో' అంటూ అక్కడినుండీ వెళ్ళిపోయింది.
అసలే ఊరికే ఊహల్లో విహరించే నాకు ఎందుకో అప్పుడే అక్కడే ఆ అమ్మాయే నేనయినట్టూ అలా సెల్లులో స్టయ్ల్ గా సొల్లు కొడుతునట్టూ..కలలు కంటుండగా............ హఠాత్తుగా....

9.మా అమ్మవే..

అని తను చెప్పడం మొదలెట్టింది.

ఆరోజు....

"నువ్వు అలా హాస్టల్ రూంలోకి వస్తూ వుండటం చూసి ఆశ్చర్యపోయాను!

నువ్వు, నీ నవ్వు, నీచూపు,నీ నడక,నీ మాట అచ్చం మా అమ్మ లాగానే వున్నావు." అంది.

" నేనా మీ అమ్మ లాగా వున్నానా ... !?" ....

" ఆ అవును !...
అప్పటినుండీ.. నీతో మాట్లాడాలని, చాలా ట్రై,చేసా కానీ నువ్వు ,నీకు తెలుగు తప్ప ఏమీ రాదన్నావు. మరి ఎలా? ఎలా?.... అని చాలా ఆలోచించా.
పోనీ 'విజయ' తో చెప్పి మాట్లాడిద్దామా అనుకున్నాను. కానీ ఎలా చెప్పాలి ? తనకూ అంతగా ఇంగ్లీష్ రాదు. అయినా అసలు నా ఫీలింగ్స్ ఇవి అని కచ్చితంగా నాకే తెలియని పరిస్తితి అది.
కానీ...కానీ.. నిన్ను చూడకుండా అసలు వుండలేకపొయేదాన్ని,అలా చూస్తుంటే మా అమ్మే అక్కడ వుందేమో అని అనిపించేది.
కానీ నువ్వేమో, అసలు నాతో ఏమి మాట్లాడలేక పొయేదానివి. అయినా నువ్వు చిన్నపిల్లవు చెబితే ఏవిధంగా అర్దం చేసుకుంటావో తెలీయదు. అదీ కాకుండా నువ్వు నన్నుచూస్తేనే భయపడే దానివి.నీ తప్పులేదు కొత్తవారితో మాట్లాడాలంటే ఎవ్వరికయినా కొంచం అదోరకమయిన అనుమానం, అవీ వస్తుండటం సహజమే ఏమి చేయాలి మరి ఆలోచించాను.....

చివరికి 'తెలుగు ' నేర్చుకుంటే ఏమయినా పరిస్కారం దొరుకుతుందేమో అనిపించి, వూరికెళ్ళి తమిళ్-తెలుగు బుక్స్ తెచ్చుకొని, తెలుగు తెలిసినవారి దగ్గర ట్యూషన్ చెప్పించుకొని.... ఎలాగయితే కష్టపడి 'తెలుగు ' నేర్చుకున్నా.
కానీ ఎంత కష్టపడ్డా ఏదీ నేర్చుకోవడం అంత ఈజీ కాదు అని మొదటిసారిగా తెలిసొచ్చింది. అదీ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఇంకా కష్టం అని కూడా...
కానీ..., నీతో ఎలాగయినా మాట్లాడాలనే తపన,కోరిక,ఇష్టం..... ఇవన్నీ కలిపి ఇంత తక్కువ సమయంలో నన్ను తెలుగు నేర్చుకొనేలాగా చేసాయి ...
పెద్దమ్మకు కూడా అప్పుడే చెప్పాను "మేము ఇక్కడ వుండలేము, తమ్ముడుకూడా చదువుకుంటున్నాడు వాడికీ కష్టమవుతుంది, డాడీ బిజినెస్ డీల్స్ కూడా చాలా వున్నాయి అవీ చూడాలి... కాబట్టి మేము ఇక్కడ వుండటం కష్టం. కానీ ప్రతీ నెలా నేను వచ్చి పోతుంటాను.. నువ్వేమీ బెంగ పెట్టుకోకు. అమ్మా వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు, మన మధ్యే వున్నారు, మన జ్ఞాపకాలలో ఎప్పటికీ వుంటారు. అక్కడినుండి వారిని తీసుకెల్లడం ఆ పెరుమాళ్ళ వల్లకూడా కాదు" అన్నాను.
అలా.. ఆమెకోసం కాకపోయినా నీకోసమయినా, కచ్చితంగా రావలని డిసైడ్ చేసుకున్నా . ఎందుకంటే నాకు ఎందుకో మా అమ్మే నా మీద ప్రేమతో నీలా వచ్చిందని నా గట్టి నమ్మకం.

"ఇందాక నువ్వు 'రిమా అక్కా ' అన్నావు చూడు...! అచ్చం మా అమ్మ కూడా నన్ను అలాగే 'రిమా తల్లీ' అనేది.. అందుకే అప్పుడే నాకు నీ మీద ఇంకా......... చెప్పలేనంతగా........... ఇష్టం వచ్చేసింది. సో నువ్వు కచ్చితంగా మా అమ్మవే !......" అంది.

అలా తను చెబుతున్నప్పుడు తన మొఖం చూడాలి..... అది ఆనందమో,సంతోషమో,అమ్మయ్య తనకు చెప్పేశాను అన్న తృప్తో.... ఇంకా ఎదో.... కాదు... ఎన్నో భావాలు కనపడుతున్నవి. ఇంక తన కళ్ళయితే యమలీల సినిమాలో ఇంద్రజను చూసినప్పుడు ఆలి కళ్ళలోలాగా.... దీపావళి కాకరపువ్వొత్తుల్లా వెలుగుతున్నాయి. .*.*.*.*.*.

నేను తననలా చూస్తుంటే....
తను "ఇప్పుడు అర్దం అయ్యాయా ? నా ఫీలింగ్స్,నా నిర్ణయం,దారి ఎంటో..?" అని అడిగింది.

నేను ఒక్కసారే ఏమి చెప్పాలో తెలియక. తలను అడ్డంగా నిలువుగా,గుండ్రంగా... తిప్పాను.

తను ఓ నవ్వు నవ్వి,
"నాకు నిన్ను చూడగానే మా అమ్మవనే "ఫీలింగ్",
నీతో మాట్లాడడానికి తెలుగు నేర్చుకొనితీరాలనే "నిర్ణయం",
పెద్దమ్మతో పాటు నిన్నుచూడడానికి ఇక్కడకి ప్రతి నెలా రావొచ్చనే "దారి"..."అంది.

నేను 'ఓహ్!' అన్నాను.(మనసులో దీనిలో ఇంత అర్దం వుందా అనుకొని.)

ఆ తరువాత తనని కలవడానికి గానీ మాట్లాడటనికి గానీ నేనెప్పుడూ సంకోచించలేదు.
ముందే అనవసరంగా నేను తనని చాలా అపార్దం చేసుకున్నానే అని చాలా బాధపడ్డాను.

ఇంతలో కొన్ని రోజుల తరువాత ......