11.సర్ప్రైజ్.

నా భుజం పై ఓ చేయి పడింది. కొన్ని సెకన్లుపాటు అది కలో నిజమో నాకు అర్దం కాలేదు.
"అరే ! హన్రెడ్ ఇయర్స్ . నీ గురించే అలోచిస్తున్నా... ఫోన్ చేస్తావని ఎదురుచూస్తుంటే నువ్వే వచ్చేసావ్ ?".
" నీకో సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. "
"సర్ప్రైజా...!? నువ్వు ఇప్పుడు ఇలా రావడమే పెద్ద సర్ప్రైజ్ తల్లీ "
"అంటే... ? నేను ఇప్పుడు ఇలా రావడం వలన నీకు ఏమయినా ఇబ్బందా ?"
"నాకా ఇబ్బందా ? నువ్వు ఇక్కడే కొన్ని రోజులు ఉండి వెళ్తానన్నా నాకు ఇబ్బందేమి లేదు. నువ్వే అనవసరంగా మా అమ్మ నీ భాష చూసి ఏమంటుందో అని భయపడతావు. కానీ మా అమ్మ ఏమీ అనదు.ఇంకా నాకు ఇంత మంచి అక్క దొరికినందుకు సంతోషిస్తుంది కూడా."
"అబ్బా అనవసరంగా నిన్ను కదిపాను. "
"ఇంతకీ ఆ రెండో సర్ప్రైజ్ ఏంటో ..?"
"ఇక్కడే ఇలా బయట నుంచోనే చెప్పాలా లోపలికి వచ్చి చెప్పాలా ?"
" అబ్బా ! చాల్లే పద లోపలికి, ఇంతకీ ఏంటీ విషయం ? మాంచి హుషారుగా ఉన్నావ్."
" అదీ..... అదీ....... నేను ...."
" ఆ నువ్వు ?"
"నేను.. నేనూ.."
"అబ్బా ఏంటో తొందరగా చెప్పు..."
"నేను ...నీకు...నీకు.."
"ఆ నీకు..."
"అహా.... నాకు కాదు నీకు "
"యహా నాకో నీకో అసలు విషయం ఏంటో చెప్పు."
"నికోఅల్లుణ్ణితెస్తున్నా..."
"ఆ"
"నేను నీకు ఒక అల్లుడిని తెస్తున్నా "
"అల్లుడా???"
" అల్లుడు కాదా ... ఏంటబ్బా...'అల్లుడు' అనే చెప్పారే ???"
" అరే! ఏంటి నీ బాధ అసలు విషయం చెప్పు .."
"నెక్ష్ట్ మంత్ నా పెళ్ళి ..."
"వావ్! నిజంగా ? ఇదయితే పెద్ద సర్ప్రైజే, కంగ్రాచ్చ్యులేషన్".
"అవునూ... నా హబ్బీ నీకు ఏమవుతాడు...?"
"నీ హబ్బీ నాకా...?..?"
"అల్లుడు కాదా...??"
"ఓహ్ నువ్వు ఆ రూట్ లో వచ్చావా...అయితే అల్లుడేలే... అదా సంగతి అందుకేనా ఇంత ఆనందం.."
"ఆ.."
"ఊ...ఎప్పుడు..? ఎక్కడ..? ఇంతకీ అతను.. అదే మా అల్లుడు గారు ఏమి చేస్తుంటారు..."
"వారిది చెన్నై, '.........' కంపెనీ లో మేనేజర్. మా పెద్దనాన్నకు తెలిసిన వాళ్ళే...నన్ను ఎప్పుడో,ఎక్కడో... చూసారంట నచ్చానంట... అందుకే వచ్చి పెద్దనాన్నను అడిగారంట నాకంటూ .... ఏవ్వరూ ............ అందుకే అంతా పెద్దనాన్నే చూసుకుంటున్నారు.
"అవునా....."
"ఊ... పెళ్ళి చాలా గొప్పగా చెయ్యాలని చూస్తున్నారు. అందులోను కరుణా అంకుల్ కూడా వస్తారు కదా పెళ్ళికి "
"కరుణ ఏవరు !?"
"కరుణా అంకుల్ తెలియదా ?
"అసలు కరుణ ఎవరో తెలిస్తేగా ఆమె అంకుల్ తెలియడానికి "
"ఏ స్టుపిడ్ ! కరుణా అంకుల్ అంటే మా ఎక్ష్ సి ఎం 'కరుణా నిధి గారు ఆయన తెలియదా ?"
"ఓ ! కరుణానిధా ! ఆయనయితే నాకెందుకు తెలియదు చాలాసార్లు మా ఇంటిలోకి కూడా వచ్చారు."
"మీ ఇంటికి వచ్చారా ?!?"
"ఆ అవును ఏ రాకూడదా ?"
"రాకూడదా అని కాదు...మీరు ఆయనకి అంత బాగా ఏలా తెలుసు అని..? మీరు ఏమయినా భందువులవుతారా ?"
"ఏహా మేము ఆయనకి తెలుసని నేనన్నానా ? ఆయన మాకు తెలుసు అన్నాను ."
"ఆయనకి మీరు తెలియదా...? మరి మీ ఇంటికి చాలా సార్లు వచ్చారన్నావు.? "
"ఇంటికన్నానా.. ? ఇంటిలోకి అన్నాను"
"???!!!??? అంటే"
"అంటే మా ఇంట్లో ఉన్న టీవీ లోకి వచ్చారు."
"నిన్నూ...బాగా తన్నాలి"
"తప్పు అమ్మని తన్నకూడదు"
"అబ్బా ! ఊ..హూ.. అయితే ఒక ముద్దు పెట్టుకుంటానులే...."
"అదయితే ఓకే"
"ఆ ....ఊ..మ్మ్ ........."
"అవునూ ఇంతకీ ఆయనెందుకొస్తారు నీ పెళ్ళికి ?"
"ఎందుకంటే ఆయనా మా పెద్దనాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి".
"ఓ అందుకా నేను ఇంకోందుకనుకున్నానులే"
"ఇంకెందుకు"
"పెళ్ళిచేయడానికి ప్లేస్ ఎక్కడా దొరక లేదేమొ అందుకే..ఆయన్ని పిలిచారేమో అనుకున్నా..."
"??? అర్దంకాలేదు !"
"నీకర్దం కాదులే.."
"ఏ చెప్పు ఎందుకు ?"
"అదే పెళ్ళి ఆయన తల మీద ఉన్న స్టేడియంలో చెయ్యడానికేమొ అని అనుకున్నాలే "
"చీ ! పాపం... తప్పు అలా అనకూడదురా"
"సర్లే ఇంకెప్పుడూ అనను
.....సారీ,
సింగిల్ పూరీ,
నీ పెళ్ళికి నా డొక్కు లారీ,
అందులో ఎక్కి చేయి సవారి.
"ఈ పూరీ,లారీ ఏంటి ?"
"ఆ... చెప్పింది విను మీనింగులడక్కు చెప్పినా నీకు అర్దం కాదు (అయినా నీకు అర్దమయ్యేటట్టు ఎలా చెప్పాలో నాకు రాదనుకో) నన్ను చావదొబ్బుతావ్ ఎందుకు చెప్పడం ?"
"సరే చెప్పొద్దులే నేను మళ్ళీ కలుస్తాను".
"ఇంకొంచం సేపు ఉండొచ్చుగా అమ్మ కూడా వస్తుంది ."
"అమ్మో అమ్మా !?? వొద్దులే ఈ సారెప్పుడయినా మాట్లాడతాను.."

.....అంటూ సుధక్క వెళ్ళిపోయింది..
తనెళ్ళిన 2 నిముషాల తరువాత........



---- నేను
---- సుధ

10.ఊహల్లో..... సెల్లులో.... సొల్లు.

నా ఇంటర్ రిసల్ట్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను . అంతా బాగుంది కాని తరువాత ఏమి చెయ్యాలి ?

CA కాని ICWA కాని చేస్తానన్నాను నేను,
మావాళ్ళందరూ,"అవి చాలా కష్టం.అయినా ఆ కోర్స్ లు మన ఊరిలో లేవు నువ్వు విజయవాడో,విశాకపట్ణమో,హైదరాబాదో.. వెళ్ళి చదవాలి, నువ్వేమో ఒఠ్ఠి అమయుకురాలివి, అదీకాక రెండు,మూడు రోజులకొకసారి కడుపునొప్పి,కాలునొప్పి అని కాలేజ్ మానేస్తుంటావ్. అలా అయితే ఇలాంటి కోర్స్ చేయలేవు.అందులోనూ అలాంటి కోర్సులు చదవాలంటే బాగా కష్టపడాలి" అన్నారు. ఇలా చాలా రోజులు చర్చ జరిగాక... 'సరే' అని నేనూ కాస్త బారిష్టర్ పార్వతీశం లెవల్లో మంచి చెడులు ఆలోచించి,' డిగ్రీ చేసాక అయినాసరే ఈ CAలో చేరితే అక్కడ బేసిక్స్ లేకుండా డైరెక్ట్ గా CAఇంటెర్ టూ లో జాయన్ అయిపోవచ్చు' అనుకొని. డిగ్రీయే చేద్దామని డిసైడ్ అయ్యా.
అయితే మరి ఈ డిగ్రీ ఎక్కడ చేయాలి... ? అని మళ్ళీ చర్చ మొదలయ్యింది. మేము ఈ మీమాంసలో ఉండగానే మా కాలేజి వాళ్ళు ఫోన్ చేసి "నువ్వు డిగ్రీయే చదవాలనుకుంటే మేము T C ఇవ్వము, మన కాలేజ్ లోనే కొత్తగా డిగ్రీ కూడా స్టార్ట్ చేసాము కదా ! కాబట్టి నువ్వు ఇక్కడే చేరాలి" అన్నారు. ఇంక చేసేదేమీ లేక అక్కడే కామ్ గా బికామ్ లో చేరిపోయా..

తెలిసిన కాలేజ్,తెలిసిన లెక్చరర్స్,తెలిసిన ఫ్రెండ్స్, తెలిసిన దారి అంతా తెలిసినవే కానీ ఎందుకో నాకు అక్కడ ఏవీ అంతగా నచ్చలేదు అది ఎందుకో, ఏమో,నాలో ఏదో తెలియని అసంతృప్తి ఉండిపోయింది. (బహుశా అన్నీ తెలిసినవే కాబట్టేమో !?).
ఇదేమాట రిమక్క దగ్గర చాలా సార్లు అన్నాను. దానికి తను " ముందు నువ్వు ముక్కు మూసుకొని మూడు సంవత్సరాలు ఇది చదువు. ఆ తరువాత నిన్ను ఏ మేనేజ్మెంట్ కోర్స్ లోనో చేర్పించ్చి నేను చదివిస్తాను కదా ".అని అంది.అంతే నా ఊహలకు రెక్కలొచ్చి ఎక్కడెక్కడో తిరిగొచ్చాను.
రోజూ సాయంత్రం కాలేజి నుండి వచ్చేటప్పుడు తను ఎదురొచ్చేది. కాసేపు ఆ రాధా అంకుల్ షాప్ లోనో,పక్కనున్న నెట్ సెంటర్లోనో మా ముచ్చట్లు సాగేవి. తను ఊరిలో లేనప్పుడు సాయంత్రం ఆ సమయానికి తన వద్ద నుండీ ఫోన్ వచ్చేది.ఇలా మేము ఇద్దరం కొన్ని నెలల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సర్వసాదరణంగా అమ్మ దగ్గర నేను ఏ విషయం దాచను. ఎందుకంటే నాకు అందరిలోకల్లా మా అమ్మే పే....ద్ద బెస్ట్... ఫ్రెండ్. అందుకు. కానీ... సుధ అక్క విషయం మాత్రం తన దగ్గర చెప్పలేదు. ఎందుకూ అంటే పెద్ద కారణాలేమీ లేవు కానీ. మొదట్లో తను కంగారు పడుతుందని చెప్పలేదు,తరువాత తను అనుమాన పడుతుందని చెప్పలేదు,ఆ తరువాత తను అనవసరంగా భయపడుతుందేమో అని చెప్పలేదు , పోను పోను చెప్పే అవసరము......., సందర్బమూ.... రాక చెప్పలేదు.
ఒకరోజు సాయంత్రం ఇంటికొచ్చి అక్క దగ్గరనుండీ ఫోన్ రాలేదేంటా అని ఆలోచిస్తూ ఎదురుచూసుకుంటూ బయట కుర్చున్నా.నేను ఫోన్ చేస్తుంటే తన ఫోన్ కలవడం లేదు. ఏమయ్ ఉంటుందా అని ఎదురు చూస్తున్నా ఇంతలో... మా ఇంటిఓనర్ గారి ఇంటికి వచ్చిన వారి బంధువులమ్మాయి బయట ఉయ్యాలలో ఉగుతూ సెల్ ఫొన్లో మాట్లదుతుంది. అది సెల్ ఫోన్స్ వచ్చిన కొత్త. మా నాన్నకు ఎప్పటి నుండో సెల్ వున్నా బయట పది చోట్ల తిరిగే వారు కాబట్టి వారికి దాని అవసరం చాలా వుంటుంది. సుధక్క చేతిలో చూసినా తనూ వందిళ్ళ పూజారమ్మ కాబట్టి తన దగ్గర ఉండటం తప్పనిసరి అనిపించేది. కానీ ఈ అమ్మాయి చేతిలో సెల్ చూస్తుంటే ఎందుకో ఆ ఫీలింగ్ రావడం లేదు. అదీ కాక ఆ అమ్మాయి అటూ ఇటూ మెలికలు తిరుగుతూ... తెలుగూ,ఇంగ్లిష్ మిక్ష్ చేసి వాటినీ మూతి అష్ట వంకర్లు తిప్పి స్టైల్ గా, మోడ్రన్ గా మాట్లాడుతూ... ఉంది నిరంతర వార్తా స్రవంతిలా...
ఆమె ఒక్క నిముషం గ్యాప్ ఇవ్వగానే నేను ఆమె దెగ్గరకు వెళ్ళి
"అక్కా మీ డాడీ ఏమి చేస్తుంటారు ?" అని అడిగాను.
దానికి తను మూతి,ముక్కు,కళ్ళు.. పైకెత్తి "బిజినెస్"అన్నది.
నేను "ఓహొ అలానా అయితే ఈ సెల్లు బిల్లు ఎవరు కడతారు". అన్నాను. "మా డాడ్" అన్నది. "అవునా ! ఇంతకీ నెలకు బిల్లు ఎంత వస్తుందక్కా " "జెస్ట్ 2000 - 2500 మద్యలో." నేను మనసులోనే కళ్ళు తేలేసి పైకి "ఓ అంతేనా." అన్నాను. "ఆ..! ఇంకా మా ఫ్రెండ్స్ కి అయితే ఇంకా ఎక్కువే వస్తుంది".అని ఏవరూ ఫోన్ చేయక పోయినా 'ఆ హలో' అంటూ అక్కడినుండీ వెళ్ళిపోయింది.
అసలే ఊరికే ఊహల్లో విహరించే నాకు ఎందుకో అప్పుడే అక్కడే ఆ అమ్మాయే నేనయినట్టూ అలా సెల్లులో స్టయ్ల్ గా సొల్లు కొడుతునట్టూ..కలలు కంటుండగా............ హఠాత్తుగా....

9.మా అమ్మవే..

అని తను చెప్పడం మొదలెట్టింది.

ఆరోజు....

"నువ్వు అలా హాస్టల్ రూంలోకి వస్తూ వుండటం చూసి ఆశ్చర్యపోయాను!

నువ్వు, నీ నవ్వు, నీచూపు,నీ నడక,నీ మాట అచ్చం మా అమ్మ లాగానే వున్నావు." అంది.

" నేనా మీ అమ్మ లాగా వున్నానా ... !?" ....

" ఆ అవును !...
అప్పటినుండీ.. నీతో మాట్లాడాలని, చాలా ట్రై,చేసా కానీ నువ్వు ,నీకు తెలుగు తప్ప ఏమీ రాదన్నావు. మరి ఎలా? ఎలా?.... అని చాలా ఆలోచించా.
పోనీ 'విజయ' తో చెప్పి మాట్లాడిద్దామా అనుకున్నాను. కానీ ఎలా చెప్పాలి ? తనకూ అంతగా ఇంగ్లీష్ రాదు. అయినా అసలు నా ఫీలింగ్స్ ఇవి అని కచ్చితంగా నాకే తెలియని పరిస్తితి అది.
కానీ...కానీ.. నిన్ను చూడకుండా అసలు వుండలేకపొయేదాన్ని,అలా చూస్తుంటే మా అమ్మే అక్కడ వుందేమో అని అనిపించేది.
కానీ నువ్వేమో, అసలు నాతో ఏమి మాట్లాడలేక పొయేదానివి. అయినా నువ్వు చిన్నపిల్లవు చెబితే ఏవిధంగా అర్దం చేసుకుంటావో తెలీయదు. అదీ కాకుండా నువ్వు నన్నుచూస్తేనే భయపడే దానివి.నీ తప్పులేదు కొత్తవారితో మాట్లాడాలంటే ఎవ్వరికయినా కొంచం అదోరకమయిన అనుమానం, అవీ వస్తుండటం సహజమే ఏమి చేయాలి మరి ఆలోచించాను.....

చివరికి 'తెలుగు ' నేర్చుకుంటే ఏమయినా పరిస్కారం దొరుకుతుందేమో అనిపించి, వూరికెళ్ళి తమిళ్-తెలుగు బుక్స్ తెచ్చుకొని, తెలుగు తెలిసినవారి దగ్గర ట్యూషన్ చెప్పించుకొని.... ఎలాగయితే కష్టపడి 'తెలుగు ' నేర్చుకున్నా.
కానీ ఎంత కష్టపడ్డా ఏదీ నేర్చుకోవడం అంత ఈజీ కాదు అని మొదటిసారిగా తెలిసొచ్చింది. అదీ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఇంకా కష్టం అని కూడా...
కానీ..., నీతో ఎలాగయినా మాట్లాడాలనే తపన,కోరిక,ఇష్టం..... ఇవన్నీ కలిపి ఇంత తక్కువ సమయంలో నన్ను తెలుగు నేర్చుకొనేలాగా చేసాయి ...
పెద్దమ్మకు కూడా అప్పుడే చెప్పాను "మేము ఇక్కడ వుండలేము, తమ్ముడుకూడా చదువుకుంటున్నాడు వాడికీ కష్టమవుతుంది, డాడీ బిజినెస్ డీల్స్ కూడా చాలా వున్నాయి అవీ చూడాలి... కాబట్టి మేము ఇక్కడ వుండటం కష్టం. కానీ ప్రతీ నెలా నేను వచ్చి పోతుంటాను.. నువ్వేమీ బెంగ పెట్టుకోకు. అమ్మా వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు, మన మధ్యే వున్నారు, మన జ్ఞాపకాలలో ఎప్పటికీ వుంటారు. అక్కడినుండి వారిని తీసుకెల్లడం ఆ పెరుమాళ్ళ వల్లకూడా కాదు" అన్నాను.
అలా.. ఆమెకోసం కాకపోయినా నీకోసమయినా, కచ్చితంగా రావలని డిసైడ్ చేసుకున్నా . ఎందుకంటే నాకు ఎందుకో మా అమ్మే నా మీద ప్రేమతో నీలా వచ్చిందని నా గట్టి నమ్మకం.

"ఇందాక నువ్వు 'రిమా అక్కా ' అన్నావు చూడు...! అచ్చం మా అమ్మ కూడా నన్ను అలాగే 'రిమా తల్లీ' అనేది.. అందుకే అప్పుడే నాకు నీ మీద ఇంకా......... చెప్పలేనంతగా........... ఇష్టం వచ్చేసింది. సో నువ్వు కచ్చితంగా మా అమ్మవే !......" అంది.

అలా తను చెబుతున్నప్పుడు తన మొఖం చూడాలి..... అది ఆనందమో,సంతోషమో,అమ్మయ్య తనకు చెప్పేశాను అన్న తృప్తో.... ఇంకా ఎదో.... కాదు... ఎన్నో భావాలు కనపడుతున్నవి. ఇంక తన కళ్ళయితే యమలీల సినిమాలో ఇంద్రజను చూసినప్పుడు ఆలి కళ్ళలోలాగా.... దీపావళి కాకరపువ్వొత్తుల్లా వెలుగుతున్నాయి. .*.*.*.*.*.

నేను తననలా చూస్తుంటే....
తను "ఇప్పుడు అర్దం అయ్యాయా ? నా ఫీలింగ్స్,నా నిర్ణయం,దారి ఎంటో..?" అని అడిగింది.

నేను ఒక్కసారే ఏమి చెప్పాలో తెలియక. తలను అడ్డంగా నిలువుగా,గుండ్రంగా... తిప్పాను.

తను ఓ నవ్వు నవ్వి,
"నాకు నిన్ను చూడగానే మా అమ్మవనే "ఫీలింగ్",
నీతో మాట్లాడడానికి తెలుగు నేర్చుకొనితీరాలనే "నిర్ణయం",
పెద్దమ్మతో పాటు నిన్నుచూడడానికి ఇక్కడకి ప్రతి నెలా రావొచ్చనే "దారి"..."అంది.

నేను 'ఓహ్!' అన్నాను.(మనసులో దీనిలో ఇంత అర్దం వుందా అనుకొని.)

ఆ తరువాత తనని కలవడానికి గానీ మాట్లాడటనికి గానీ నేనెప్పుడూ సంకోచించలేదు.
ముందే అనవసరంగా నేను తనని చాలా అపార్దం చేసుకున్నానే అని చాలా బాధపడ్డాను.

ఇంతలో కొన్ని రోజుల తరువాత ......

8.మళ్ళీ మొదటికా...?


కొంచం సేపటికి....తను మళ్ళీ చెప్పడం ప్రారంభించిది..... ఇంత జరిగినా మా అమ్మమ్మా వాళ్ళు ఎవ్వరూ కనీసం మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు. కానీ ఇక్కడుండే మా పెద్దమ్మ వచ్చి మమ్మల్ని తనతో పాటు తీసుకెల్తానని చాలా బ్రతిమలాడింది.

ఈ ఊరు, ఈ ఇల్లు ఒదిలి రావడమా...?
ఇది మాడాడీ కట్టుకున్న ఇల్లు, తన కలలకు, ఆశలకు,ఆశయాలకు...నిలయమయిన ఇల్లు,మేము పుట్టి,పెరిగిన ఇల్లు , మా అమ్మా,నాన్నలతో ఎన్నో మధురమయిన అనుభవాలు,ఆనందాలు పంచుకున్న,అందమయిన జ్ఞాపకాల పొదరిల్లు.
అలాంటి దీన్ని ఒదిలి, రాష్ట్రం కాని రాష్ట్రంలో, బాష కూడా రాని ప్రదేశంలో, పరాయి ఇంట్లో, మేము ఎలా ఉండగలం ? ఎలా రాగలం ? మా ఇద్దరికీ అది ఇష్టం లేదు.

నెల రోజుల తరువాత..

పెద్దమ్మ కూతురు 'విజయ ' ఫొన్ చేసింది.

'అమ్మ చాలా అప్సెట్ అయ్యింది. చాలా బాధ పడుతుంది.
నిద్రలో 'చెల్లీ...అంతా నావల్లే ' ' నా హస్తవాసి అంత మంచిది కాదు అందుకే ఇలా..అంతా నావల్లే... ' అంటూ కలవరిస్తుంది.
నాకు ఎగ్జాంస్ జరుగుతున్నాయి. అందుకే అమ్మని అలా చూడలేక నాన్న బావని ఒప్పించి మా అక్కని తీసుకొచ్చి అమ్మ దగ్గర వుంచారు నేను హాస్టల్లో వుంటున్నాను, నువ్వు ఒక్కసారి వచ్చి వెళ్ళరాదు.." అంది.

నాకు అదివిని చాలా బాధేసింది.

రెండు రోజులాగి, తమ్ముణ్ణి స్కూల్ హాస్టల్లో చేరిపించి,

నేను పెద్దమ్మని చూడటానికి ఇక్కడకి వచ్చాను.

పెద్దమ్మ చాలా పీలగా అయ్యిపోయింది. నాకామెను చూసి ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి రమ్మని చాలా గొడవ చేసింది. నేను ఆమెకు నచ్చచెప్పి చూసాను. తను నా మాట వినేట్టులేదు. పెద్దమ్మ చాలా మొండిగా.. నా తప్పుకు ఇదే ప్రాయశ్చిత్తం ... అంటూ వాదిస్తుందే..! కానీ ఎలా నేనిక్కడ వుండడం... ?

'నేను విజయ దగ్గరకు వెళ్ళివస్తానని ' చెప్పి, విజయ హాస్టల్ కి వచ్చాను. అమ్మను ఎలాగయినా ఒప్పించమని విజయకూ చెప్పాను.

మేము ఇలా అనుకుంటుండంగానే ఆ రూంలోకి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అది నువ్వూ,మీ ఫ్రెండ్.

నాకు నిన్ను చూడగానే ఆశ్చర్యం వేసింది,!..? కాసేపు నీ వైపే అలా చూస్తూ ఉండిపోయాను.

ఇంతలో విజయ "ఏంటి ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నవ్ ?" అని అడిగింది.

నేను " ఏమీ లేదు, ఊ.. నువ్వు చెప్పు " అన్నాను.

అప్పుడే నీకు గుర్తుందో లేదో నీ పేరు అడిగాను.

నువ్వు చెప్పావ్ . (నేను 'ఆ అవును గుర్తుంది అంటూ' తల వూపాను ).

అప్పుడు కూడా... నాకు అదే ఫీలింగ్..

తరువాత కూడా నిన్ను చూడాలని, కలవాలని, నీతో మాట్లాడాలని చాలా ట్రై చేసాను.

కానీ నీకు నా భాష రాదు, నాకు నీ భాష రాదు ఎలా..?

వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను, పెద్దమ్మ సమస్యకూ అది దారి చూపింది, కాదు కాదు చూపెట్టెటట్లు నువ్వే చేసావు.


****************************

వెంటనే నేను

"ఆహా...! మళ్ళీ...... నువ్వు,నీ కోసం,నీ గురించి,నీ వలన,

అక్కా మళ్ళీ మొదటికివచ్చావా.... !?

నన్ను చూసి ఎందుకు ఆశ్చర్యం !? నేనేమన్నా విచిత్ర కోతిలా వున్నానా !?

ఏంటా ఫీలింగ్....!? గిలిగింతలు పెట్టుకొని నవ్వాలనా ?

ఏంటా నిర్ణయం...!? నా తోకలాంటి జడ పట్టుకొని ఆడాలనా ?

ఏంటా దారి...!? నా మెడలో తాడు ఒకటి కట్టి మీ పెద్దమ్మకి ఇచ్చి ఆటాడించమని చెప్పాలనా ?చెప్పు..? చెప్పక్కా ? చెబుతావా లేదా ? " అని అడిగాను.

అప్పటిదాకా సీరియస్ గా చెబుతున్న తను ఇది విని ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టింది.

ఆ నవ్వు తను మనస్పూర్తిగా(మనసారా) నవ్వుతున్నట్టనిపినిచింది. ఎందుకంటే అంత అందమయిన నవ్వు నేను ఇంతక ముందు ఎన్నడూ,ఎవ్వరూ నవ్వగా చూడలేదు.
స్వచ్ఛమయిన నవ్వంటే ఏంటో అప్పుడే నాకు మొదటిసారిగా తెలిసింది.


తను నవ్వాపి "అరె..! అదే చెపుతున్నా వినవమ్మా" అంటూ చెప్పడం ప్రారంభించింది...


*******************